![బీఆర్ఎస్ దోస్తానాతోనే ఆప్ ఓటమి : ఎమ్మెల్యే కడియం శ్రీహరి](https://static.v6velugu.com/uploads/2025/02/aap-delhi-defeat-due-to-brs-friendshipsays-kadiyam-srihari_dLaI7yV6vT.jpg)
- లిక్కర్ స్కామ్ తో కేజ్రీవాల్ పరువు గంగలో కలిసింది: కడియం
- ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్
- స్టేషన్ ఘన్ పూర్ లో ఉప ఎన్నికలొస్తే పోటీకి సిద్ధమని వెల్లడి
వరంగల్, వెలుగు: బీఆర్ఎస్ తో స్నేహం చేయడం వల్లే ఢిల్లీలో ఆప్ ఓటమి పాలైందని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కామెంట్ చేశారు. ‘‘బీఆర్ఎస్ తో ఆప్ దోస్తానా తర్వాతే లిక్కర్ స్కామ్ జరిగింది. ఈ కేసులో ఆప్ అగ్రనేతలు కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా సహా మరొకరు జైలుకెళ్లారు. దీంతో వాళ్ల పరువు గంగలో కలిసింది” అని అన్నారు. ఆదివారం హనుమకొండలోని తన నివాసంలో మీడియాతో కడియం మాట్లాడారు.
‘బీఆర్ఎస్ వల్ల ఆప్ ఓడితే కేటీఆర్ కు సంతోషమెందుకు?’ అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేసుంటే ఫలితాలు వేరేలా ఉండేవన్నారు. పట్టుదలకు పోయి రెండు పార్టీలూ నష్టపోయాయని చెప్పారు. దీనిపై కాంగ్రెస్ సైతం సమీక్ష చేసుకోవాలని సూచించారు. ‘‘ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పు రాబోతున్నది. ఒకవేళ స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలొస్తే.. నేను పోటీలో ఉండి ఎదుర్కొంటానే తప్ప, పారిపోయే ప్రసక్తే లేదు” అని తెలిపారు.
బీఆర్ఎస్ వి సుద్దపూస మాటలు..
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అని కడియం మండిపడ్డారు. ‘‘బీఆర్ఎస్ పెద్దలు సుద్దపూసల మాదిరి మాట్లాడుతున్నారు. అసలు వారు లేకుంటే పార్టీ ఫిరాయింపులే లేవు. పదేండ్ల పాలనలో దాదాపు 36 మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. అందులో కొందరు రాజీనామా చేయకుండానే మంత్రులయ్యారు. ఫిరాయింపులు వాళ్లు (బీఆర్ఎస్) చేస్తే సంసారం.. వేరేవాళ్లు చేస్తే వ్యభిచారమా?” అని ప్రశ్నించారు. ఫిరాయింపులను ప్రోత్సహించి వ్యవస్థను భ్రష్టుపట్టించిందే బీఆర్ఎస్ అని మండిపడ్డారు.
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ లో చేరానని చెప్పారు. దీనికి జనం మద్దతు ఉంది కాబట్టే ఎంపీ ఎన్నికల్లో తమకు మెజార్టీ ఓట్లు వచ్చాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక సీఎం రేవంత్ రెడ్డితో రూ.100 కోట్ల పనులకు శంకుస్థాపన చేయిస్తానని తెలిపారు. ‘‘2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు. కానీ ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం ఎస్సీల రిజర్వేషన్లను 18 శాతానికి పెంచాలి. ఇందులో ఏబీసీడీ వర్గీకరణ చేయాలి” అని డిమాండ్ చేశారు.